చదువుల తల్లిగా పిలువబడే శ్రీ సరస్వతీదేవీ నెలకొన్న ప్రసిద్ధ క్షేత్రాలు దేశంలో ఎన్నో వున్నాయి. అటువంటి వాటిలో అనంతసాగర్ లో నెలకొన్న క్షేత్రం ఒకటి! ఇక్కడ చెట్లు చేమలు, కొండలు దొనెలుతోకూడిన సుందర ప్రకృతి అందరినీ కట్టిపడేస్తాయి. మెదక్ జిల్లా సిద్ధిపేట డివిజన్ లో వున్న ఈ అనంతసాగర్ గ్రామశివార్లో ఒక చిన్న కొండమీద ‘శ్రీ సరస్వతీ క్షేత్రం’ నిర్మించబడింది. ఇక్కడ సరస్వతీదేవి నుంచునివుండి, వీణా, పుస్తక, జపమాల ధరించివుంటుంది. దేవికి కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణాకాళి కొలువుతీరి వున్నారు.
ఆలయం నిర్మాణం వెనుక కథ :
ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారకులు శ్రీ అష్టకాల నరసింహరామశర్మ. ఈయన తన 16వ ఏట 41 రోజులపాటు బాసరలో సరస్వతీ దేవిని ధ్యానిస్తూ గడిపారు. అప్పుడు ధ్యానంలో ఆ దేవి దర్శనమై.. తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించిందట. అయితే.. ఏ ఆసరాలేని శర్మ ఆలయం గురించి అప్పుడెక్కువ ఆలోచించలేదు. కానీ కొంతకాలం తర్వాత జీవనోపాధి సంపాదించుకోవటం మొదలుపెట్టాక ఆలయ నిర్మాణంకోసం స్థలం ఎంచుకుని.. 1980లో నిర్మాణం మొదలుపెట్టారు. పది సంవత్సరాలు శ్రమించి తన స్వార్జితంతో ఆలయ నిర్మాణం కావించారు.
విశేషాలు
ఈ ఆలయానికి సమీపంలో రాగి దొనె, పాల దొనె, చీకటి దొనె అనే పేర్లతో మూడు చిన్న చిన్న గుహలలాంటివాటిలో జలాశయాలున్నాయి. ఇదివరకు ఇవి 8 వుండేవని అంటుంటారు. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసుకున్నారుట. 60 గజములపైనే లోతు వున్న ఈ దొనెలలో వుండే నీరు పేరుకు తగ్గ రుచిలోనే వుంటాయి. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. రైతులు ఈ నీటిని తీసుకువెళ్ళి పంటలపై జల్లితే పంటలకు పట్టిన చీడలుపోయి చక్కని పంటలు పండుతాయని విశ్వాసంతో అలా చేస్తారు.
ఉత్సవాలు
ప్రతి సంవత్సరం వసంత పంచమినాడు వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రంనుంచి మూడు రోజులపాటు దేవి త్రిరాత్రోత్సవములు జరుగుతాయి. విజయదశమినాడు జరిగే దేవీ విజయోత్సవం, శమీపూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.